ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ శాఖలో ఓ శునకానికి, గుర్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఐటీబీపీలో విధులు నిర్వహిస్తున్న ఈ రెండింటికీ అధికారులు మెడల్స్ అందచేశారు. అత్యుత్తమైన విధులు నిర్వహిస్తున్నందుకుగానూ వీటిని మెడల్స్ తో సత్కరించారు.
స్నోయి మెలినాయిస్ అనే కుక్క 25 మంది ఐటీబీపీ జవానుల ప్రాణాలు కాపాడింది. ఛత్తీస్ ఘడ్ లోని భకర్ కట్టా అటవీప్రాంతంలో మందుపాతరను కనుగొనింది. ఈ కుక్క ముందు వెళుతుంటే, జీపులో జవానులు దాని వెనక వస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో మందుపాతర ఉండడాన్ని గుర్తించిన ఈ శునకం, జవానులను అప్రమత్తం చేసింది. అక్కడ తవ్వి చూడగా భారీ మందుపాతర బయటపడింది. అలా ఈ శునకం జవానుల ప్రాణాలు కాపాడింది. ఇదొక్కటే కాదు ఇలా చాలాసార్లు మందుపాతరలు కనిపెట్టడంతో పాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో కీలకపాత్ర పోషించింది. ఇక గుర్రం కూడా పెరేడ్ గ్రౌండ్స్ లో అత్యుత్తమ పెర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది. వీటి ప్రతిభకు గుర్తింపుగా శునకానికి, అశ్వానికి మెడల్స్ అందచేశారు.