ఇంజనీరింగ్ కాలేజీలో పేద పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారం. సరైన వసతులు లేని కాలేజీల్లో కూడా ప్రచార ఆర్భాటాలతో లక్షలకు లక్షలు ఫీజులు గుంజే పరిస్థితి. అయితే మహొన్నతమైన ఒక ఆశయంతో బీహార్ లోని బక్సర్ జిల్లా హరియోన్ అనే గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యాదాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు మూతపడే పరిస్థితి ఏర్పడింది. లాభాపేక్ష లేకుండా ఇద్దరు రిటైర్డ్ డీఆర్డీవో శాస్త్రవేత్తలు, బెంగుళూరుకి చెందిన ఒక డాక్టర్, ఒక ఆడిటర్, ఒక సామాజిక కార్యకర్త ఈ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు అందించేందుకు ముందుకొచ్చారు. ఏడాదికి హాస్టల్ ఖర్చులతో కలిపి 72వేలు వసూలు చేస్తారు. పేద పిల్లలు ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే, ఫీజుకు బదులు ఆవులు ఇస్తారు. నాలుగేళ్ళ కోర్సుకు ఐదు ఆవులు ఇవ్వాల్సి ఉంటుంది. కళాశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాలలో ఈ ఆవులను పోషిస్తారు. వాటి ద్వారా వచ్చిన పాలను హాస్టల్ పిల్లలకే వినియోగిస్తారు.
బహుశా ఈ పధకం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలా 22 మంది విద్యార్ధులు ఏడాదికి ఒక ఆవును ఫీజుగా ఇచ్చి కాలేజీల్లో చదువుతున్నారు. ఇప్పుడు కాలేజీ మూతపడే పరిస్థితి. బ్యాంకులు ఇచ్చిన ఐదు కోట్ల రుణం తిరిగి చెల్లించినా, దానికి వడ్డీ చెల్లించలేదని నోటీసులు ఇచ్చి, కాలేజీని మూసి వేయించేందుకు ఆర్డర్ తీసుకొచ్చారు. మరో పది కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద లోన్ అడిగినా, లంచాలు ఇవ్వలేదని రుణం ఇచ్చేందుకు నిరాకరించారు. వందల, వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా తిరిగే కార్పోరేట్ల కాళ్ళు కడిగే బ్యాంకు సిబ్బంది… ఇలాంటి ఒక మహోన్నతమైన ఆశయంతో కాలేజీ నిర్వహణ కోసం మాత్రం రుణం అందించకపోవడం దుర్మార్గం. ఈ కాలేజీ నుంచి వెళ్ళిన చాలామంది పేద విద్యార్ధులు దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.