మూడో భర్త చేతిలో హత్యకు గురైన అర్చనారెడ్డి అనే మహిళ హత్య కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అర్చనారెడ్డి కూతురు యువికా రెడ్డి కూడా దోషి అని సమాచారం. హత్యలో ఆమెకు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానించి ఆమెను కూడా అరెస్ట్ చేశారు. బెంగుళూరుకు చెందిన అర్చనారెడ్డికి 40 ఏళ్ళు. ఇదివరకే ఇద్దరు భర్తలను వదిలేసి మూడో భర్తగా నవీన్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. దాదాపు నాలుగేళ్ళ కాపురం తర్వాత ఇద్దరి మధ్య కలతలు వచ్చాయి. రెండో భర్త విడాకులు ఇవ్వకముందే బాడీ బిల్డర్ గా ఉండే నవీన్ తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకటయ్యారు. నవీన్ తో కూడా ఆస్తి విషయంలో తగాదాలు వచ్చాయి. అర్చనాకు 40 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నాయి. గత కొంతకాలంగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. మూడు రోజుల క్రితం జిగానీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొడుకు, మరో ఇద్దరితో కలిసి ఆమె కారులో వెళ్ళి ఓటు వేసి రాత్రి సమయంలో తిరిగి వస్తోంది. మూడో భర్త నవీన్ కిరాయి గ్యాంగ్‌లతో రోడ్డు మధ్యలోనే అడ్డగించి కారులో నుంచి కిందకి దించి కత్తులతో పొడిచి చంపేశాడు. తల్లి హత్యను కళ్ళతో చూసిన కొడుకు అరవింద్ పోలీసులకు సమాచారం అందించాడు.
అర్చనకు మూడో భర్తగా ఉంటూనే నవీన్ ఆమె కూతురు యువికపై కన్నేశాడు. ఆమెతో సంబంధం ఏర్పరచుకున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ హత్యలో కూతురు యువిక పాత్ర ఏమిటో తెలుసుకునేందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తల్లితో ఉంటూనే కూతురుతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న నవీన్, తల్లి హత్య కుట్ర కూతురుకి కూడా తెలుసని భావిస్తున్నారు. యువికతో మూడో భర్త నవీన్ కు అక్రమ సంబంధం ఉందని అనుమానం రావడంతోనే ఆమె నవీన్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కూతురితో సంబంధం కొనసాగించడం కోసం మరియు ఆస్తి విషయంలో తగాదాలు రావడంతోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.