బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నై వద్ద తీరం దాటింది. తమిళనాడులోని కరైకాల్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య ఇది తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ భావించింది. అయితే అల్పపీడం బలహీనపడడంతో దిశ మార్చుకుని చెన్నై తీరాన్ని తాకింది. ఇప్పటికే చిగురుటాకులా వణికిన చెన్నై నగరం, ఇప్పుడు అతలాకుతలం కానుంది. కాగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు చెన్నైకి దగ్గరగా ఉన్న ఏపీపైన కూడా దీని ప్రభావం కనిపించనుంది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఈ నాలుగు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. నెల్లూరు జిల్లాలో వర్షాల ధాటికి జనజీవనం స్థంభించిపోయింది. ప్రధాన రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలుల వేగం పెరగడంతో చలితీవ్రత పెరిగింది.
గంట గంటకూ గాలుల తీవ్రత పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సముద్రంలో 45 నుంచి 55 కి.మీ.. గరిష్ఠంగా గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిది.