అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిర్లక్ష్యం, అధికార పార్టీలో ఉన్న వారికి బానిసత్వం.. ఇలా చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా మారిపోయారన్న విమర్శల నేపధ్యంలో.. ఓ జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్య ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బహుశా భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్ ఇలాంటి పని చేయలేదు. తనకు ఒక నెల జీతం కట్ చేయమని జిల్లా కలెక్టర్.. ఆ జిల్లా ట్రెజరీని ఆదేశించారు. తాను డిసెంబర్ నెలలో సరిగా పని చేయలేకపోయానని, ప్రజల ఫిర్యాదులు పరిష్కరించలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యత ఎవరిదైనా జిల్లా కలెక్టర్ గా తాను బాధ్యత తీసుకుంటున్నానని అందువల్ల తనకు రావాల్సిన జీతం.. నిలిపి వేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు.
సీఎం హెల్ప్ లైన్ కు అందిన ఫిర్యాదుల పరిష్కారానికి గడువు ముగిసి వంద రోజులు దాటినా, ఇంకా ఆ సమస్యలు అలాగే ఉన్నాయని కింది స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందువల్ల వాళ్ళ జీతాలు కూడా ఆపేయండని.. ఇందులో తన బాధ్యత కూడా ఉంది కాబట్టి, తనకు జీతం కూడా కట్ చేయాలని కోరారు. రెవెన్యూ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న తహశీల్దారుల ఇంక్రిమెంట్లు కూడా ఆపేయాలని ఆదేశించారు. ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకున్న కలెక్టర్ పేరు కరమ్ వీర్ శర్మ. మధ్యప్రదేశ్ రాష్ట్రలోని జబల్ పూర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు.