శరీరాలు కలిసి పుట్టిన కవల పిల్లలు సోహన్, మోహన్ విధికి ఎదురు నిలిచారు. పుడుతూనే చనిపోతారని అనుకున్న బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు. పట్టుదలతో చదువుకున్నారు. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. ఒకే శరీరంతో ఇద్దరూ చదివి ఉద్యోగం పొందడం నిజంగా చాలా గొప్ప విషయం.
సోహన్, మోహన్ అనే ఈ అవిభక్త కవలలు పంజాబ్ విద్యుత్ సంస్థలో టెక్నీషియన్లుగా చేరారు. జీతం నెలకు 20 వేలు. అమృత్ సర్ కి చెందిన ఈ అవభక్త కవలలు పాలిటెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవి మంచి మార్కులతో పాసయ్యారు. ఆ తర్వాత తమకు ఉద్యోగం చేయాలని ఉందని ప్రభుత్వానికి దరకాస్తు చేసుకున్నారు.
దారుణమైన అంగవైకల్యానికి ఎదురొడ్డి, విధికి ఎదురు నిలిచి ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన వీరిని పంజాబ్ ప్రభుత్వం అభినందించి నేరుగా ఉద్యోగ అవకాశం కల్పించింది. ప్రస్తుతం సోహన్, మోహన్ అనే అవిభక్త కవలలు సబ్ స్టేషన్లో టెక్నీషియన్లుగా చేరారు.
వీరికి రెండు గుండెలు, నాలుగు చేతులు, రెండు కిడ్నీలు, రెండు వెన్నెముకలు ఉన్నా.. ఒకటే కాలేయం, ఒకటే గాల్ బ్లేడర్. రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి. పుట్టుకతో వీరిని తల్లిదండ్రులు వదిలేశారు. ఆ తర్వాత ఒక సామాజిక సేవా సంస్థ వీరిని చేరదీసి పెంచి పెద్దచేసి చదివించింది. చిన్నప్పుడే వీరిని విడదీయాలని డాక్టర్లు ప్రయత్నించినా, విడదీస్తే ఇద్దరిలో ఒకరు చనిపోతారని భావించి వదిలేశారు. వీరు అలాగే పెరిగి పెద్దయ్యి.. ప్రయోజకులయ్యారు.