షర్మిల ఎవరు వదిలిన బాణం..?

    0
    880

    ఆంధ్రలో ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఎవరు వదిలిన బాణమో అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు పెట్టేవారు ముందుగా సహజంగా చెప్పే మాటల్ని షర్మిల చెప్పింది. అయితే ఆమె పార్టీ పెట్టబోతుందన్నమాట మాత్రం వాస్తవం. తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీకి ఏపీ ముఖ్యమంత్రి, ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులున్నాయా, లేవా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, కుటుంబ పరంగా వారి మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు చూస్తే ఇదేదో తెరవెనక రాజకీయ మాయగా తోస్తోంది.

    తెలంగాణలో రాజన్న రాజ్యం

    తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ చెప్పిన షర్మిల మొదటి ప్రయత్నంలోనే టీఆర్ఎస్ పై విసుర్లు విసిరింది. రాష్టర సరిహద్దుల్లో ఉన్న నల్గొండ జిల్లా నేతలతో సమావేశం ప్రారంభించడం వెనక కూడా ఓ కీలకమైన అంశం ఇమిడి ఉంది. నల్గొండ జిల్లాలో ఒకప్పటి కాంగ్రెస్ నాయకులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయులు, ఆప్తులు కూడా. ఆయనకు ఆ జిల్లాలో అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఇంకా ముఖ్యంగా ఆ జిల్లాలో రాజకీయంగా రెడ్ల ప్రాబల్యం కూడా ఎక్కువే. అందువల్లనే ఆమె తన మొదటి రాజకీయ ములాఖత్ ను నల్గొండ జిల్లానుంచి ప్రారంభించింది అని భావించేందుకు అవకాశం, ఆస్కారం ఉంది.

    అధికారం కోసమేనా..?

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల గడువుంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయ బరిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరుగా పోరు సాగుతోంది. మధ్యలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు, కీచులాటలతో క్షీణదశకు చేరుకుంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మిగులుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉన్నా, ఒకప్పుడు ఆ పార్టీ తెలంగాణలో అత్యంత బలమైన పార్టీయే అయినా, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో 1.2 శాతానికి మించి ఓట్లు ఆ పార్టీకి రాలేదు. దీన్నిబట్టి హైదరాబాద్ లోనే ఉన్న ఆంధ్రులు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని అర్థమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని టీఆర్ఎస్, బీజేపీ తలపడుతుండగా.. మధ్యలో షర్మిల కొత్త పార్టీ పేరుతో రంగప్రవేశం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం, మరో పార్టీకి అవకాశం ఇచ్చేంత రాజకీయ శూన్యత తెలంగాణలో లేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల తనకు తానుగానే పార్టీని స్థాపించి అధికారంకోసం తాపత్రయ పడుతోందని నమ్మడం కూడా కష్టం. ఎందుకంటే తెలంగాణ సంస్కృతితో కానీ, సాంప్రదాయంతో కానీ రాజకీయ వారసత్వాలతో కానీ, ఏమాత్రం సంబంధం లేని షర్మిల, కేవలం రాజన్న రాజ్యం అంటూ ఒక నినాదంతో ముందుకు పోవడమే అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ ఉద్యమం తర్వాత తిరుగులేని ఎన్టీఆర్ ప్రభంజనమే, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు రాజన్న రాజ్యం అన్న నినాదానికి అక్కడ అవకాశం ఉందని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి స్పష్టమైన రాజకీయ పరిస్థితుల్లో, షర్మిల పార్టీ పెట్టడం వెనకున్న ఉద్దేశం రాజకీయ సమీకరణల తారుమారుకోసమేనన్నది ఒక వాదన.

    ఎవరికి నష్టం? ఎవరికి లాభం?

    ఇటీవల పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో తన పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తానని ప్రకటించారు. దీని వెనక కూడా ఎవరున్నారో అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు షర్మిల పార్టీ వెనక కూడా వారి హస్తమే ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పెట్టే పార్టీ వల్ల రెడ్లు, ఇతర మైనార్టీ వర్గాలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు, తెలంగాణలో ఉండే ఆంధ్రులు, వీళ్లంతా అటు కాంగ్రెస్ వైపో, ఇటు టీఆర్ఎస్ వైపో ఉన్నారు. ఇప్పుడు ఆమె పార్టీ పెడితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న రాజకీయ సమీకరణల దృష్టిలో బేరీజు వేసుకుంటే.. షర్మిల తెలంగాణలో ఎవరు వదిలిన బాణమో తేలిపోతుంది.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

     

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

     

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

    ఇవి కూడా చదవండి: 

    ప్రియురాలి కోసం బాబా వేషం..

    సోఫాలు మంచాలు .. అన్నింటికి బంగారు రేకుతో తాపడం