జయలలిత, ఆ నలుగురు మరణాల కేసు రీఓపెన్ ..

  0
  1249

  త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత చెందిన కొడ‌నాడు ఎస్టేట్ దోపిడీ కేసు అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఎస్టేట్‌ వాచ్‌మెన్‌ హత్య కేసులోని నిందితులంతా వరుసగా మృతి చెందటం ఎన్నో అనుమానాల‌కు తావిచ్చింది. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులు, అనుమానితులు వ‌రుస‌గా యాక్సిడెంట్ లో మృతి చెంద‌డం కూడా సెన్సేష‌న్ అయింది. అయితే ఈ కేసులో మిస్ట‌రీ వీడ‌క‌పోవ‌డంతో కాల‌క్ర‌మేణా నీరుగారిపోయింది. కేసును క్లోజ్ చేశారు. అయితే డీఎంకే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాజాగా ఈ కేసును రీ ఓపెన్ చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతోంది.

  నిజానికి జయల‌లిత‌ మృతి చెందిన తర్వాత కొడనాడు ఎస్టేట్‌, జ‌య స‌న్నిహితురాలు శశికళ వ‌శ‌మైంది. ఆ త‌ర్వాత ఈ ఎస్టేట్ లో భారీ దోపిడీ జ‌రిగింది. విలువైన ద‌స్తావేజులు, ఆస్తులు, బంగారం, న‌గ‌దు చోరీకి గురైంది. ఎస్టేట్ వాచ్ మెన్ ను హ‌త్య చేసి దుండ‌గులు ఈ దోపిడీ చేశారు. అయితే సీసీ పుటేజీ ఆధారంగా ఈ హ‌త్య‌కేసులో జ‌యల‌లిత కారు డ్రైవ‌ర్ క‌న‌గ‌రాజ్ ఉన్నాడ‌ని గుర్తించి ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు. ప‌రారీలో ఉన్న క‌న‌గ‌రాజ్ కోసం పోలీసులు గాలిస్తుండ‌గా, సేలం వ‌ద్ద రోడ్డుప్ర‌మాదంలో అత‌ను మృతి చెందాడు. అయితే క‌న‌గ‌రాజ్ మృతిపై త‌మ‌కు అనుమానాలున్నాయ‌ని అప్ప‌ట్లో అత‌ని కుటుంబీకులు ఆరోపించారు. ఇది యాక్సిడెంట్ కాదు హ‌త్య అని ఫిర్యాదు చేశారు.

  మ‌రోవైపు ఈ కేసులో మ‌రో అనుమానితుడు స‌యాన్ కూడా కారు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. అత‌నితో పాటు భార్య కూతురు కూడా యాక్సిడెంట్ లో చ‌నిపోయారు. వీరిద్ద‌రూ ఒకే స‌మ‌యంలో అనుమానాస్ప‌దంగా రోడ్డుప్ర‌మాదాల్లోనే చ‌నిపోవ‌డం సంచ‌ల‌నమైంది. ఇక కొడ‌నాడు ఎస్టేట్ అకౌంటెంట్ కూడా ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం కూడా ప‌లు అనుమానాల‌కు కార‌ణ‌మైంది.


  అయితే స‌రైన ఆధారాలు లేక‌పోవ‌డం, నిందితులు, అనుమానితులు వ‌రుస‌గా రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోవ‌డంతో… కొడ‌నాడు ఎస్టేట్ దోపిడీ కేసు మిస్ట‌రీగా మిగిలిపోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వంగానీ, అధికారులు గానీ ఈ కేసుపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. తాజాగా ఈ కేసు మ‌ళ్ళీ రీఓపెన్ అయింది. డీఎంకే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎంగా స్టాలిన్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఈ కేసులో క‌ద‌లిక మొద‌లైంది. ఈ కేసులో లోతైన విచార‌ణ కోసం స్పెష‌ల్ టీంను డీఎంకే ప్ర‌భుత్వం ఏర్సాటు చేసింది. ఇక నుంచి ఈ టీమ్ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డింది. కొడ‌నాడు ఎస్టేట్ దోపిడీ మిస్ట‌రీ కేసులో ఒక్కొక్క‌ చిక్కుముడి వీడితే, ఈ కేసు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.