పెళ్ళయిన మూడేళ్ళకే తెలివిగా ఓ భార్య ప్రియుడి సహకారంతో భర్తను చంపించింది. అది కూడా సినీ ఫక్కీలో నాటకమాడి భర్తను చంపించినప్పటికీ.. పోలీసుల విచారణలో ఈ దారుణం బయటపడింది. తమిళనాడులోని టెన్ కాశీలో భార్యాభర్తలు వైరస్వామి, ముత్తుమారి ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ డ్యూటీ అయిపోయిన తర్వాత లింగాపురం వెళతారు.
నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ రాత్రి సమయంలో బైక్ పై వెళుతుండగా.. మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి బైక్ ఆపి.. ఆ మహిళ మెడలో మంగళసూత్రం లాక్కునే ప్రయత్నం చేయగా.. ఈ సందర్భంగా జరిగిన గొడవలో భర్త హతమయ్యాడు. ఇదే విషయాన్ని భార్య పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. రోడ్డుపక్కనే చెట్లలోకి తీసుకెళ్ళి తన భర్తను దారుణంగా చంపేశారంటూ.. రోడ్డుపై వాహనదారులకు చెప్పి.. పోలీసుల దృష్టికి విషయం తీసుకెళ్ళింది.
పోలీసులకు ముత్తుమారి వ్యవహారంపై అనుమానం రావడంతో.. ఆమె మొబైల్ డేటా పరిశీలించారు. పెళ్ళికి ముందే ఆమె ఓ యువకుడితో సంబంధం ఉందని, పెళ్ళి తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగించడంతో.. విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడని తెలిసింది. తమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే ప్రియుడితో కలిసి ముత్తుమారి హత్యకు ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.