ఆర్థ్ర నక్షత్ర జాతకుడు.. అందుకే ఆ మెంటాలిటీ

    0
    1827

    జ్యోతిష్యంలో 27 నక్షత్రాల్లో ఆర్థ్ర నక్షత్రానికున్న ప్రత్యేకతే వేరు. ఆర్థ్ర నక్షత్ర జాతకుల లక్షణాలు, వారి వ్యవహారశైలి అంతా భిన్నంగా ఉంటాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థ్ర నక్షత్ర జాతకుడే. ఆర్థ్ర నక్షత్రంలో పుట్టినవారికి.. కు, కం, జ, ఛ అనే అక్షరాతలో మొదలయ్యే పేరు పెడతారు. ఆ లెక్కన చూస్తే.. జగన్మోహన్ రెడ్డికి నక్షత్ర ప్రకారమే నామకరణం జరిగిందని అర్థమవుతోంది.
    గోపూజ సందర్భంగా గోత్ర నామాలు చెబుతూ సీఎం జగన్ నక్షత్రాన్ని ప్రస్తావించారు పురోహితులు. అలా జగన్ ఏ నక్షత్రంలో పుట్టారనే విషయం బయటపడింది.

    ఆర్థ్ర నక్షత్ర జాతకుల గుణగణాలు

    జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఆర్థ్ర నక్షత్ర జాతకుల గుణగణాలు, భవిష్యత్ ఎలా ఉంటుందో స్పష్టంగా వివరించి ఉంది. మిథునరాశిలో 6.40 నుంచి 20 డిగ్రీలలో ఈ ఆర్థ్ర నక్షత్రం ఉంటుంది. రుద్రుడు ఈ నక్షత్రానికి అధిపతి. రాహువు ప్రభావం ఈ నక్షత్ర జాతకులపై ఎక్కువగా ఉంటుంది. నక్షత్రాధిపతి రుద్రుడిలాగానే మంచిదనం, కరకుదనం. మెతకదనం, గట్టిదనం. ప్రేమ, ద్వేషం. విధ్వంసం, నిర్మాణం ఈ లక్షణాలన్నీ కలసి ఉంటాయి. అలా చూస్తే జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి లక్షణాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

    మెతకదనం.. కరుకుదనం

    సానుకూల ధోరణి, వ్యతిరేక ధోరణి రెండిటి మీద ఈ జాతకుల ప్రభావం ఉంటుంది. హృదయంలో ఎంత మెతకదనం, ఎంత ప్రేమతత్వంతో ఉంటారో, తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కఠినమైన జీవిత మార్గాన్ని ఎంచుకుంటారు. జీవితంలో అనేక అవరోధాలను, కష్టాలను కోరి తెచ్చుకున్నా తర్వాత వాటిని అధిగమించి, ఆశయాలను నెరవేర్చుకుంటారు. త్యాగం, మొండితనం ఈ రెండు కూడా వారిని సంతృప్తికరమైన ముగింపు వరకు తీసుకెళ్తాయి. జగన్ రాజకీయ జీవితాన్ని పరిశీలించి చూస్తే.. ఆయన తన లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో మనందరికీ తెలిసిన విషయమే.
    కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించి జగన్ కోరి కష్టాలను కొని తెచ్చుకున్నారనే సానుభూతి చాలామందిలో ఉంది. అప్పట్లోనే అధిష్టానంతో మంచిగా ఉంటే జగన్ జైలుపాలయ్యేవారు కాదని కూడా అంటారు. అలా సింపతీ చూపించినవారే.. ఆ తర్వాత కాలంలో జగన్ ఎదుగుదలను చూసి గర్వపడ్డారు. కోరి కష్టాలను కొని తెచ్చుకున్నా కూడా సంతృప్తికర ముగింపువైపు జగన్ అడుగులేశారని అర్థమవుతుంది.

    ఆర్థ్ర నక్షత్ర జాతకులు కొన్ని విషయాల్లో ఎంత నిర్లక్ష్యంగా, ఇతరుల ద్వేషానికి గురవుతారో, అంతే స్థాయిలో ప్రేమాభిమానాలకు పాత్రులవుతారు. పది మందిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తారు.
    ప్రతి పనిలోనూ చివరి వరకు ప్రతిది సంపూర్ణంగా జరగాలని కోరుకుంటారు. బయటకు కఠినంగా కనపడినా, అభిమానులను, తనను ప్రేమించే వారిని, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కృతజ్ఞతా భావం కూడా అంతే ఉంటుంది. కృతజ్ఞతను చూపించడంలో, అభిమానించినవారికోసం ఏదో ఒకటి చేయాలని తపన పడటంలో జగన్ ముందు వరుసలో ఉంటారని, ఆయన వ్యవహార శైలి తెలిసినవారు చెబుతుంటారు.

    గతంలో తనతోపాటు జైలు జీవితం అనుభవించిన మోపిదేవి వెంకట రమణకు మంత్రి పదవి ఇచ్చారు, ఆ తర్వాత ఎంపీని చేశారు. ఈడీ కేసుల్లో ఉద్యోగం పోగొట్టుకుని జైలుకి వెళ్లిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని.. ఇప్పుడు ఏపీ కేడర్ కి తీసుకొచ్చి మంచి పోస్టింగ్ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యేలోగా నీలం సాహ్నికి మరో పదవి సృష్టించి ఇచ్చారు. ఇలా జగన్ మేలు పొందినవారి సంఖ్య చాలా పెద్దది.

    మెతకదనం ఎంత ఉంటుందో, కఠినత్వం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో కూడా జగన్ చాలా మొండిగా ఉంటారని అంటారు. తన తండ్రి హయాంలో కలసి పనిచేసి, తర్వాత తనను విభేదించి బయటకు వెళ్లి, తిరిగి తన వద్దకు వచ్చిన కొంతమంది నేతలపై జగన్ ఇంకా కఠినంగా ఉండటానికి అదే కారణం అని అంటారు.

    తెలియని విషయాన్ని చాలా తెలివిగా ఇతరలనుండి నేర్చుకుని, దాన్ని బయటపడనీయకుండా తమ పరిజ్ఞానాన్ని మాత్రమే బయటకు చూపిస్తారు ఆర్థ్ర నక్షత్ర జాతకులు. ఏ పని చేసినా, ఆ పనిలో చివరికంటా ఫలితాలను సాధిస్తారు. తన పనికి మెప్పు కోరుకోని మనస్తత్వం ఆర్థ్ర నక్షత్ర జాతకుల ప్రత్యేకత. తను చేయాలనుకున్న పని చేసుకుంటూ పోవడమే ఆ జాతకుల లక్షణం.
    ఒక పనిలో వైఫల్యం చెందినా, ఇబ్బందులు ఎదురైనా ఆ అసహనాన్ని అసంతృప్తిని బయటపడనీయకపోవడం కూడా ఈ నక్షత్రంలో పుట్టినవారి ప్రత్యేక లక్షణం. 32నుంచి 42ఏళ్ల వయసులోగా ఆర్థ్రా నక్షత్ర జాతకులు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఇలా ఆర్థ్ర నక్షత్ర జాతకుల తీరు ఉంటుంది. నక్షత్ర జాతక రీత్యా సీఎం జగన్ నూటికి నూరుపాళ్లు ఆ లక్షణాలను పునికి పుచ్చుకున్నారు.

    ఇది కూడా చదవండి:

    నిమ్మగడ్డ మొండి – జగన్ మహా మొండి  https://ndnnews.in/cm-jagan-vs-election-commissioner-nimmagadda/