పశువుల పాకనుంచి… ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వరకు

  0
  937

  నిరుపేద కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలు.. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఉన్నత ఉద్యోగాలు సంపాదించడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి విజయగాథల్లో సోనాల్ శర్మ కథ కూడా ఒకటి. పేదరికం ఆమెకు అడ్డురాలేదు, కుటుంబ పోషణకోసం రోజువారీ పనులు ఆమెకు ఆటంకం కాలేదు. చదువుపై ఉన్న శ్రద్ధ, లక్ష్యంపై ఉన్న ఏకాగ్రత ఆమెను జడ్జిగా మార్చాయి. సాధారణ పాలవ్యాపారి కుమార్తె, రోజూ పశువుల పాకలో.. పేడఎత్తి, పాలుపితికి, వాటి యోగక్షేమాలు చూసుకునే ఓ యువతి.. నేడు రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరిస్తోంది.

  ఇదీ సోనాల్ విజయ గాథ..

  రాజస్థాన్ ఉదయపూర్ కి చెందిన ఖ్యాలీ లాల్ శర్మ అతి సాధారణమైన పాల వ్యాపారి. ఆయన కుమార్తె సోనాల్ శర్మ. ఖ్యాలీ లాల్ ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముకుని వస్తేనే వారికి కుటుంబం గడుస్తుంది. ఇంటి వద్ద పశువుల ఆలనా పాలనా చూసేందుకు, పశువుల కొట్టంలో పేడ ఎత్తి, వాటికి దాణా వేసి, పాలు పితికేందుకు భార్య, కుమార్తె ఖ్యాలీ లాల్ కి సాయం చేస్తుండేవారు. నాలుగేళ్ల వయసునుంచి సోనాల్ శర్మ పశువులపాకతోనే కాలం గడుపుతూ వచ్చింది. 26ఏళ్ల వయసు వచ్చేనాటికి జడ్జిగా తన కల నెరవేర్చుకుంటోంది.

  ఇటు పని.. అటు చదువు..

  చిన్నప్పటి నుంచి సోనాల్ శర్మకు చదువంటే ఎంతో ఇష్టం. న్యాయమూర్తి కావాలనేది ఆమె కోరిక. కానీ సోనాల్ తండ్రికి ఉన్నత చదువులు చెప్పించే స్తోమత లేదు. సోనాల్ తో పాటు ఇద్దరు పిల్లలు ఉండటం వల్ల కుటుంబ పోషణ భారమైంది.ఇలాంటి సమయంలోనే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పశువులను చూసుకుంటూ, పాలు పితకడం, కుడితి పెట్టడం వంటి పనులను చేస్తూ ఆ పశువుల పాకనే తన పాఠశాలకు మలుచుకుంది సోనాల్. ఒక వైపు కుటుంబ పనులలో సహాయంగా ఉంటూ, మరొకవైపు చదువుపై దృష్టి సారించింది.

  యూనివర్శిటీ టాపర్

  పాలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొని చదువుకునేది సోనాల్. స్కూల్, కాలేజీ విద్యాభ్యాసం ఉదయ్ పూర్ లోనే సాగింది. టెన్త్, ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ తర్వాత మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంనుంచీ ఐదేళ్ల న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది సోనాల్. ఎల్ఎల్బీలో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. స్థానికంగా ఇచ్చే భామాషా అవార్డ్ కూడా ఆమె అందుకుంది. యూనివర్సిటీ టాపర్‌ గా నిలిచినందుకు ఆమెకు ఛాన్సలర్ అవార్డ్ కూడా దక్కింది.

  ఆ తర్వాత ఎల్ఎల్ఎం. పశువుల పాక లోనే కూర్చుని పశువుల అవసరాలను తీరుస్తూ రెండేళ్లపాటు ఎల్ ఎల్ఎం కూడా పూర్తి చేసింది సోనాల్. తరువాత రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీసెస్ (RJS)-2018కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఎంతో కష్టం. అందుకు తగిన పుస్తకాలు కొనే స్తోమత కూడా వారి కుటుంబానికి లేదు. కానీ సోనాల్ పట్టు విడవకుండా కాలేజీకి సైకిల్ మీద పెళ్లి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివి వాటిని నోట్సు రాసుకుని ఇంట్లో చదువుకునేది. ఈ విధంగా రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలను పూర్తి చేసింది.

  గత సంవత్సరం RJS 2018 పరీక్ష ఫలితాలు వెలువడగా వాటిలో కేవలం ఒక్క మార్కు తేడాతో అర్హత కోల్పోయింది సోనాల్. ఆమె పేరు వెయిటింగ్ లిస్టులో ఉండిపోయింది. అయితే RJS 2018 పరీక్షలో అర్హత సాధించిన ఏడుగురు ఉద్యోగంలో జాయిన్ కాలేదు. ఈ విషయం తెలిసిన సోనాల్ తనకు అవకాశం కల్పించాలంటూ రాజస్థాన్ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆ ఏడుగురు అభ్యర్థులు స్థానాలలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం కల్పించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ విధంగా సోనాల్ శర్మ మొదటి ప్రయత్నంలోనే న్యాయమూర్తిగా అవకాశాన్ని సంపాదించింది. త్వరలోనే రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా సోనాల్ శర్మ బాధ్యతలు తీసుకోబోతోంది. పశువుల పాకనుంచి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వరకు అలా సోనాల్ ప్రస్థానం కొనసాగింది.

  ఇవి కూడా చదవండి:

  ఆర్థ్ర నక్షత్ర జాతకుడు.. అందుకే ఆ మెంటాలిటీ : https://ndnnews.in/reason-behind-jagan-typical-mentality/

  జల్లికట్టుని ఓకే అంటూ.. కోడి పందాలను ఎందుకు కాదంటున్నారు..? : https://ndnnews.in/jallikattu-vs-cock-fight-which-is-right-which-is-wrong/

  భర్తలకు వయాగ్రా వాడకంపై భార్యలే డాక్టర్లను సలహా అడుగుతున్నారు: https://ndnnews.in/wifesdemndsviagra/