జాలి లేని కొడుకు కంటే కుక్క మేలురా… అన్నాడో సినీ కవి. ఇలాంటి కొడుకును చూస్తే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. కని పెంచిన కన్నతల్లిని కాలదన్ని పరాయిదేశం వైపు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడా కొడుకు. తనను ఒంటరిగా విడిచి వెళ్ళద్దంటూ కాళ్ళా వేళ్ళా పడ్డా కనికరించలేదు. కొడుకు ఎడబాటును భరించలేకపోయినా ఆ కన్నతల్లి.. కొడుకుపై ఫిర్యాదు చేసింది. విదేశాలకు పారిపోతున్న కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..
మైలాపూర్ కు చెందిన దుర్గాంబళ్ కు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్దకొడుకు రెండేళ్ళ క్రితం చనిపోయాడు. రెండో కొడుకు రామకృష్ణన్ అమెరికాలో ఉంటున్నాడు. ఉన్నత ఉద్యోగం చేస్తూ భార్యాబిడ్డలతో హాయిగా ఉంటున్నాడు. ఇటీవలే దుర్గాంబళ్ భర్త చనిపోయాడు. తండ్రి చనిపోయాడన్న దుర్వార్త విని కూడా ఆ కొడుకు రాలేదు. అంత్యక్రియులు పూర్తయిన పది రోజుల తర్వాత వచ్చాడు. 74 ఏళ్ళ వయసున్న తల్లి పరిస్థితిని అర్ధం చేసుకునే కనీస ప్రయత్నం కూడా చేయలేదా కొడుకు. తిరిగి అమెరికా ప్రయాణానికి సిద్దమయ్యాడు.
తనను విడిచి వెళ్ళొద్దని, జీవనాధారం కూడా లేదని, తాను ఒంటరిగా ఎలా బతకగలను అంటూ కొడుకును ప్రాధేయపడింది. అయినా ఆ కర్కోటకుడు తల్లి మాటను పెడచెవిన పెట్టాడు. ససేమిరా అంటూ తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయేందుకు సిద్దమయ్యాడు. కొడుకును ప్రాధేయపడినా కనికరించకపోవడంతో.. ఆ తల్లి గుండె మండింది. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తన దీనగాధ వివరించింది. కొడుకుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అమెరికా వెళ్ళేందుకు రెడీ అవుతున్న కొడుకును అరెస్ట్ చేశారు. సీనియర్ సిటిజన్స్ పర్యవేక్షణ చట్టం–2007 కింద పోలీసులు కేసు నమోదు చేసి, రామకృష్ణన్ విదేశానికి వెళ్లకుండా ఎయిర్ పోర్టుకి లుక్‌అవుట్ నోటీస్ పంపారు.
ఇవి కూడా చదవండి..