కరోనా సమయంలో ఖాళీగా కూర్చోలేక ఓ భారతీయుడు చేసిన పని అతన్ని ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు తెచ్చింది. ఖాళీగా కూర్చున్న అతను ఏం చేశాడని తక్కువ అంచనా వేయద్దు. ఇంటిపనో.. తోటపనో.. వంటివి అస్సలు అనుకోవద్దు. ఏకంగా ఓ విమానాన్నే సొంతంగా తయారుచేశాడు. నాలుగు సీట్లు ఉండే విమానాన్ని రూపొందించి…తన భార్యా ఇద్దరు బిడ్డలతో సహా యూరప్ దేశాలను చుట్టి వచ్చేశాడు. ఇప్పటివరకు బ్రిటన్ మొత్తం తిరిగేశాడు. జర్మనీ, ఆస్ట్రియా, జకస్లోవియా ఇలా దేశాలన్నీ తిరిగేస్తున్నాడు.
అతని పేరు అశోక్ అసెరిల్ తమారక్షన్. కేరళకు చెందిన ఈ వ్యక్తి.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. సాధారణంగా నాలుగు సీట్లున్న విమానాలు చాలా అరుదు. తన భార్యా ఇద్దరు బిడ్డలను ఎక్కడికి వెళ్ళాలన్నా విమానంలో తీసుకెళ్ళాలనే ఆలోచనతో.. ఈ పని మొదలుపెట్టేశాడు. సింగిల్ ఇంజన్ విమానానికి తన చిన్న కూతురు దివ్య పేరు పెట్టాడు. 38 ఏళ్ళ అశోక్ కేరళలో మాజీ ఎమ్మెల్యే తమరక్షన్ కొడుకు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు.
2006 నుంచి తన భార్య అభిలాషతో కలిసి లండన్ లోనే ఉంటున్నాడు. 2018లో ఇతనికి పైలెట్‌గా లైసెన్స్ కూడా వచ్చింది. అప్పుడే రెండు సీట్లున్న విమానాలను తయారు చేసి అద్దెకు ఇచ్చేవాడు. తనకు ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత నలుగురితో కలిసి విమాన ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉందని భావించి.. నాలుగు సీట్లున్న విమానాన్ని తయారు చేశాడు. ఇంతకీ ఈ విమానం ఖర్చు ఎంతనుకుంటున్నారు. ఇండియాలో ఖరీదైన కారు ధర కంటే చాలా తక్కువ. ఈ విమానానికి అయిన ఖర్చు కేవలం కోటి 8 లక్షలు మాత్రమే. ఇప్పుడు అదే విమానం వేసుకుని కేరళలోని తన ఇంటికి వచ్చాడు అశోక్.