నిమ్మగడ్డతో తాడో పేడో..

    0
    965

    ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తాడో పేడో తేల్చుకోడానికే వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు ఫుల్ బెంచి పక్క పెట్టింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవచ్చని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ ప్రభుత్వం మరోసారి సుప్రీం డోరు తట్టింది. పంచాయతీ ఎన్నికల అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం అందులో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.

    హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ..

    హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.

    సుప్రీంలోనే తేల్చుకుంటాం.. – వైసీపీ నేతలు

    పంచాయతీ ఎన్నికల అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం కోసమే ఈ ఎన్నికలను వాయిదా వేయాలని చెబుతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా స్వీప్‌ చేస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

    తమ ప్రభుత్వం భయపడి స్థానిక ఎన్నికల వాయిదా కోరడంలేదని అన్నారు మంత్రి విశ్వరూప్. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. రాజకీయాలు కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్య మన్నారు. ‘‘ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే..కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. కొవిడ్‌ కారణంగా ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. సీఎం జగన్‌ ఎన్నికలంటే భయపడే వ్యక్తి కాదు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆయన. రాష్ట్రంలో 51 శాతం ఓట్లతో, 85 శాతం సీట్లతో అధికారంలో ఉన్న మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం’’ అని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

    ఏపీ ఎన్జీవోల అసంతృప్తి..

    స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఉద్యోగులు ఆశించినట్టుగా లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేసి ఉద్యోగుల వాదన వినిపిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో కరోనా భయం ఎక్కువగా ఉందని.. టీకా పంపిణీ పూర్తయిన తర్వాత ఎన్నికలు జరపాల్సిందిగా కోరినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రెండు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆ తర్వాత ఉద్యోగులు కూడా ఎన్నికలకు సిద్ధమేనని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగులపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముందన్నారు. మరో రెండు నెలల పాటు వాయిదావేయాలని కోరారు.