ఇటీవల తమ జీతాలు పెంచాలంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జీతాలు పెంచేది లేదని ఖరాఖండిగా చెప్పిన ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. అదే మసమయంలో వారు చేస్తోంది సేవ మాత్రమేనని, అది ఉద్యోగం కాదని కూడా సెలవిచ్చారు మంత్రులు. సీఎం జగన్ కూడా వాలంటీర్లకు ఓ బహిరంగ లేఖ రాయడంతో జీతాల పెంపు విషయంలో వాలంటీర్లు డీలా పడ్డారు. కానీ ఇప్పుడు వాలంటీర్లందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పారు జగన్.
సచివాలయ వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. జిల్లా స్థాయిలో వాలంటీర్లకు ఈ సన్మాన కార్యక్రమాలుంటాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా వాలంటీర్లను సత్కరిస్తారని, వారికి సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలిస్తారని ప్రకటించారు. ప్రణాళిక శాఖ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ వాలంటీర్ల పురస్కారాల విషయాన్ని ప్రస్తావించారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా సమీకరణ, విశ్లేషణ ఒకరికి ప్రత్యేకంగా అప్పగించాలని పేర్కొన్నారు.
వాలంటీర్ల జీతాలు పెంచకుండా, వారికి ఇలా పురస్కారాలు అందిస్తూ అసంతృప్తి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం జగన్. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందనేది మాత్రం అనుమానమే. జీతాలు పెంచాలనే డిమాండ్ పక్కనపెట్టి, సేవా రత్న, సేవా మిత్ర అనే బిరుదులతో వాలంటీర్లు సంతృప్తి పడతారా అనేది తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..
ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?
బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?