ప్రకృతి ఎంతో అందమైనది. మనసుల్ని పరవశింప చేస్తుంది. ప్రకృతి సోయగాలను చూస్తూ మైమరచిపోవచ్చు. ప్రకృతి ఒడిలో సేద తీరిపోవచ్చు. అదే ప్రకృతికి కోపం వస్తే, ప్రళయం… విలయం… విధ్వంసం. ఇందుకు సజీవసాక్ష్యం.. ”దివిసీమ ఉప్పెన”. దీని గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. తెలిసినవారు ఉండకపోవచ్చు. కానీ చెప్పుకోడానికి చరిత్రలో ఆనవాళ్ళు తప్ప ఏమీ మిగలని అనంత శోకమిది. తీవ్ర విషాదగాధ ఇది. కాలం రాసిన కన్నీటి చుక్క ఇది. ప్రకృతికి ఎందుకు కోపం వచ్చిందో… దివిసీమ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో … రాత్రికి రాత్రే జలసమాధి అయ్యారు. ఒక్కరా, ఇద్దరా… పదులా, వందలా… వేలకు వేల మంది అసువులుబాసారు. పచ్చని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఊళ్ళకు ఊళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి.
1977 నవంబర్ 19… ఈ తేదీ వింటే చాలు… దివిసీమ ప్రజలు ఇప్పటికీ వణికిపోతుంటారు. సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాలంటే భయపడిపోతుంటారు. అంతటి విషాదం ఈ తేదీకి ఉందంటే… ఆరోజు జరిగిన జలవిలయం ఎలాంటిదో ఊహించుకోండి. కృష్ణాజిల్లాలోని పులిగడ్డ వద్ద డెల్టా ప్రాంతమే దివిసీమ. కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలవగా, మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఇప్పుడంటే మెరుగైన సమాచార వ్యవస్థ ఉంది. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఎలాంటి విపత్తు వచ్చినా ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకునే అవకాశమైనా ఉంది. కానీ 1977లో అంతటి వ్యవస్థ మనకు అందుబాటులో లేదు. రేడియో శకం బాగా ఉన్నరోజుల్లో ఏ విపత్తు వచ్చినా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసేది. అదే విధంగా 1977 నవంబర్ 17, 18 తేదీల్లో బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను సంభవిస్తోందని, భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ రేడియోలో హెచ్చరికలు చేసింది. అందరూ భారీగా వర్షాలు కురుస్తాయని భావించారే తప్ప, విధ్వంసం వస్తుందని ఎవరూ అనుకోలేదు. అందులోనూ కృష్ణా డెల్టా ప్రాంతవాసులు అస్సలు ఊహించలేదు. అదే చివరిరాత్రి అని కల కనలేదు. నిజం చెప్పాలంటే ప్రకృతి విలయం సృష్టించిన కాళరాత్రి.
నవంబర్ 19వ తేదీ ఉదయం నుంచే హోరుగాలి… జోరు వాన… మేఘాలన్నీ కమ్ముకున్నాయి… చిమ్మచీకట్లు అలముకున్నాయి… భీకరవర్షం కురుస్తోంది. గడియారం చూస్తే తప్ప.. పగలో రాత్రో కూడా తెలియని పరిస్థితి. సాయంత్రం దాటి రాత్రయింది… అందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. తుఫాను తీవ్రత అంతకంతకూ పెరిగిపోయింది. తీవ్రతుఫానుగా మారిపోయింది. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. తాటిచెట్టంత ఎత్తుకు ఎగిరెగిరి పడుతున్నాయి. అలలతాకిడితో మంటలు రేగాయి. ఇక ఒక్కసారిగా తీరం దాటిన ప్రళయ తుఫాను, దివిసీమపై విరుచుకుపడింది. క్షణాల్లోనే కబళించేసింది. పెను విధ్వంసం సృష్టించింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రాకాసి అలలు ఊళ్లను ముంచెత్తాయి. గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ఈ ఉప్పెనలో వేలమంది ప్రజలు జలసమాధి అయ్యారు. వేలసంఖ్యలో కళేబరాలై తేలిన పశువులు, శ్మశానాలుగా మారిన ఊళ్లు, కూకటివేళ్లతో సహా విరిగిన చెట్లు, ఎటుచూసినా వరదలు, ఎక్కడ చూసినా శవాల గుట్టలు… ఇలా దివిసీమ పెను ప్రళయానికి, జలవిలయానికి సాక్ష్యంగా నిలిచింది.
ఇక్కడ జరిగిన విపత్తు నష్టం ఖచ్చితంగా చెప్పడానికి ఇప్పటికీ ఆధారాలు లేవు. అంచనాలు తప్ప. ఎందుకంటే ఆరోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి మనిషే లేకుండా పోయాడు. 17వేల మందికి పైగా ప్రజలు మృతి చెందారు. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 10 లక్షల మూగజీవాలు బలయ్యాయి. వందకు పైగా గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఉప్పెనతో దాదాపు 20, 30 ఊళ్ళ మీద ఇసుక మేటలు వేసేసింది. ఈ ఇసుక మేటల కింద వేల శవాలు. ఈ మృతదేహాలను వెలికి తీసేందుకు రెండేళ్ళకు పైగా సమయం పట్టింది. దివిసీమ ఉప్పెన బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సహాయకచర్యలు చేపట్టింది. ప్రజాసంఘాలు, ఎన్జీవోలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇక వెండితెర వేల్పులైన నందమూరి తారక రామారావు, అక్కినేనినాగేశ్వరావులు ఉప్పెన బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. జోలె పట్టి భిక్షాటన చేశారు. కళారంగం నుంచి ఈ ఇద్దరు ప్రముఖులు ముందుకొచ్చి, రాష్ట్రవ్యాప్తంగా జోలెతో తిరిగి, వచ్చిన మొత్తాన్ని బాధితుల కోసం వినియోగించారు
ఓటర్ల లిస్టు ఆధారంగా మృతులను లెక్కించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సామూహిక దహన సంస్కారాల కోసం ఇతర ప్రాంతాల నుంచి కట్టెలు తీసుకురావాల్సి వచ్చింది. ఈ తీవ్ర తుఫాను గాలి వేగం… ప్రపంచంలో ఇప్పటివరకు రాలేదు. గంటకు 195కి.మీ వేగంతో గాలులు వీచాయట. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంతో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయిన ప్రళయ విధ్వంసమే ‘దివిసీమ ఉప్పెన’. ఆ సంఘటన గుర్తొస్తే, దివిసీమ వణికిపోతుంది. అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ మహా ఉప్పెనకు, చేదు జ్ఞాపకాలకు, కన్నీటి గాధలకు నేటితో 44 ఏళ్ళు.