కనులపండువగా శనగల బసవన్న అభిషేకం

    0
    66

    శ్రీశైల క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలో కొలువుదీరిన నందీశ్వరునికి శనగల బసవన్న అని పేరు. నందికి శనగలు ప్రియమైనవి. అందువల్ల భక్తులు గుడ్డలో శనగలు ఉంచి నంది మూతికి కడతారు. అలా శనగల బసవన్న అని పేరు వచ్చిందంటారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత భక్తులు ఈ నందీశ్వరుని చెన్నుకల్లు బసవన్న అని పిలిచేవారు. ఆ పేరు కాలక్రమంలో శనగల బసవన్న అయి ఉంటుందని చెబుతారు.

    త్రయోదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి ) విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. త్రయోదశి సందర్భంగా దేవస్థాన సేవగా ప్రదోషకాలంలో కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని , పాడి సమృద్ధిగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు కలిగి, సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.

    నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, శుద్ధ జలాలు, వేదమంత్రాలతో శాస్తోక్తంగా అభిషేకం చేశారు. స్వామి వారికి నూతన వస్త్రాలు స‌మ‌ర్పించి, విశేష పుష్పాలతో అర్చించి.. నానబెట్టిన శనగలు నందీశ్వరస్వామికి సమర్పించారు. శనగల బసవన్న ఆరాధనతో సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, రుణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు పేర్కొన్నారు.

    కరోనా మహమ్మారి నేపథ్యంలో తొలిసారిగా బసవన్న అభిషేకం పరోక్ష సేవ కార్యక్రమం నిర్వహించగా 95 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ ఈఓ కేఎస్‌ రామారావు తెలిపారు. ప్రతి నెలలో శుద్ధ, బహుళ త్రయోదశి రోజుల్లో ప్రదోషకాలంలో సేవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గ‌ల‌ భక్తులు www.srisaladevasthanam.org లేదంటే www.tms.ap.gov.in వెబ్‌సెట్ల ద్వారా సేవకు రూ.1,116 చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.