వ్యాక్సిన్ బాధ్యత మాదే – ప్రధాని మోదీ

    0
    41

    దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వేళ, జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేస్తుందని తెలిపారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. సెకండ్‌ వేవ్‌ కంటే ముందే ఫ్రంట్‌లైన్‌ యోధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్టు మోదీ తన ప్రసంగంలో తెలిపారు.

    “వ్యాక్సిన్‌తయారీలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డాం. మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్‌ తయారుచేశారు. ఇప్పటివరకు 23కోట్ల డోసులు పంపిణీ చేశాం. తక్కువ సమయంలో టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. టీకా తయారీలో అన్ని విధాలుగా కేంద్రం మద్దతిచ్చింది. టీకా తయారీ సంస్థలు, క్లినికల్‌ ట్రయల్స్‌ కు పూర్తి మద్దతుగా నిలిచాం. కేంద్రం తీసుకున్న కచ్చితమైన నిర్ణయాల వల్లే వ్యాక్సిన్లు వచ్చాయి. దేశంలో 7 కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయి. మరో మూడు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాసల్‌ స్ప్రే టీకా కోసం కూడా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనం ఎవరి కంటే వెనుకబడిలేం. కొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి మరింత వేగవంతమవుతుంది. జూన్‌ 21 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుంది. వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే” అని మోదీ తెలిపారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..