మూడు రాజధానుల కొత్త వికేంద్రీకరణ బిల్లు ఎలా ఉండబోతోంది..? అసెంబ్లీలో పాత మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లుని ఉపసంహరించుకుంటూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు, కార్యరూపం దాల్చేందుకు మరెంతోకాలం లేదు. నెలరోజుల లోపలే కొత్త రాజధానుల ముసాయిదా ప్రణాళిక సిద్దం చేసి అసెంబ్లీ ఆమోదానికి పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గలేదని, న్యాయ, సాంకేతిక కారణాలు మరియు అపోహలు, అపార్థాల వల్లనే కొత్త ఆలోచనలతో ముందుకొస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. కొత్త బిల్లు ఆలోచన ప్రకారం, అసెంబ్లీ కర్నూలులో పెట్టబోతున్నారని సచివాలయం విశాఖపట్నంలోనే ఉంటుందని, అమరావతిలో హైకోర్టునే ఉంచుతారని చెబుతున్నారు. పాత వికేంద్రీకరణ బిల్లులో హైకోర్టు మార్పుపైనే న్యాయపరమైన అభ్యంతరాలు ఉన్నాయని, ఇవి కోర్టులో న్యాయ సమీక్షలు నిలబడే పరిస్థితి లేకపోవడం వల్ల మొత్తంగా బిల్లుని వెనక్కి తీసుకున్నారని చెబుతున్నారు.
అసెంబ్లీ సెక్రటేరియట్ ని ఏర్పాటు చేసినంత సులభంగా హైకోర్టుని తరలించడం సాధ్యం కాదని, హైకోర్టు ఏర్పాటు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఆమోదం కింద కేబినెట్ తీర్మానం, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే ఏర్పాటై ఉంటుంది కాబట్టి, ఈ విషయంలో ప్రత్యర్థి వర్గం నుంచి బలమైన వాదన వినిపించడంతో ఈ ఒక్క కారణంతో మొత్తం బిల్లునే రద్దు చేసే అవకాశం ఉండటం వల్ల ప్రభుత్వమే ముందు ఆలోచనతో బిల్లు ఉపసంహరించుకున్నట్టు అసెంబ్లీలో తెలిపి, హైకోర్టుకి పంపి కేసు కొనసాగకుండా చేసుకుంది. మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రసంగాల్లో స్పష్టమైంది. కొత్త ఆలోచనల ప్రకారం కర్నూలే అసెంబ్లీకి కేంద్రం కానుంది. విశాఖలో సెక్రటేరియట్, అమరావతిలో హైకోర్టు.. ఇదే మూడు రాజధానుల ప్రతిపాదనగా ఉండబోతుందని చెబుతున్నారు. 1956లో కర్నూల్ రాజధానిగా , మొదట ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత హైదరాబాద్ స్టేట్ ను , కలిపి ఆంద్రప్రదేశ్ గా , హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడిరాష్ట్రం ఏర్పడింది. అందువల్ల కర్నూల్ గతంలోనే ఆంధ్రకు రాజధానిగా నిర్ణయించారు. ఇప్పుడు మళ్ళీ కర్నూల్ రాజధాని ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పాత రాజధాని మళ్ళీ వచ్చినట్టే.