అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శిబిరాలు ఏర్పాటు చేసినా చివరకు జేసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
నామినేషన్ నుంచే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ పోరాటం ప్రారంభించారు. వైరి పక్షాలు తనని నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నాయని ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వార్డు వాలంటీర్ల వ్యవహారంపై కూడా ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. చివరకు తాడిపత్రిలో జరిగిన ఎన్నికల్లో 36 వార్డులకు గాను 2 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగగా.. టీడీపీకి 18, వైసీపీకి 14 లభించాయి. సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో సీటులో గెలుపొందారు. వైసీపీకి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 18కి పెరిగింది. టీడీపీ తరపున ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తన ఓటు నమోదు చేయించుకోవాలి చూసినా సాధ్యం కాలేదు. దీంతో ఎన్నిక అనివార్యం అయింది. అయితే అనూహ్యంగా సీపీఐ సహా స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీకే మద్దతివ్వడంతో ఆ పార్టీ తరపున ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు.