తోడేళ్ళగుంపులుగా విగ్రహాల విధ్వంసం జరిగిన ఊళ్లపై పడి , ఉద్రిక్తతలు రెచ్చగొడితే చరిత్ర మిమల్ని క్షమించదు.

    0
    190

    రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం పూర్తిగా రాబందుల రాజకీయమైపోయింది. అది అధికారపార్టీ కానీ , ప్రతిపక్షంకానీ అసలు సమస్యను వదిలేసి పరస్పరం బురదచల్లుకుంటున్నారు. ఆ బురదలో సిగ్గులేకుండా పన్నీటి స్నానం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే , రామతీర్షం గొడవను పెంచిపెద్దదిగా చేసిన , ప్రతిపక్షనేత చంద్రబాబు విగ్రహాల విధ్వంసం ఆపండి అంటూ ఒక్క పిలుపు కూడా ఇవ్వలేకపోయారు. ఆయన ప్రతిపక్షనేత. ముఖ్యమంత్రి జగన్ కంటే వయసులోనూ , అనుభవంలోనూ పెద్దవారు. అటూఇటూ జగన్ వయసు ఆయన అనుభవమంత ఉంది. ప్రభుత్వంలోఉన్నవారు విగ్రహాల విధ్వంసం వెనుక టిడిపి హస్తం ఉందంటున్నారు. దీనిలో నిజాలేమిటో పరమాత్ముడికే తెలియాలి. అయితే ఒక భాద్యతగల నేతగా , ఆయన విగ్రహాల విధ్వంసం ఆపండి అంటూ ఒక్క పిలుపు ఇవ్వాల్సింది. అమరావతి రైతులకు న్యాయం చేయమని చేతులెత్తి దండం పెట్టారు, శంకుస్థాపన శిలాఫలకం ముందు మోకరిల్లారు . రైతులకోసం జోలె పట్టారు. వాళ్ళకోసం అలుపెరుగని పోరాటంచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మతాన్ని పదేపదే వేలెత్తి చూపుతున్నారు. అయితే మనం చేస్తున్నదేమిటి ..? హిందువుల దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే రాజకీయ భోగిమంటల్లో చలి కాచుకుంటున్నాం . ఆ మంటలు క్రమంగా పెద్దవై రాష్ట్రాన్ని దహించే పరిస్థితి వస్తే ఎవరూ ఏమీ చేయలేరు. విచిత్రం ఏమిటంటే రాజకీయపార్టీల కార్యకర్తలు కూడా గొర్రెలమందల్లా తమ నాయకుల, పార్టీల వాదననే తలకెత్తుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తంతు ఇలాగే కొనసాగితే , అది ఏ రాజకీయపార్టీకీ లాభం కాదన్నవిషయం వాస్తవం. దీన్ని రాజకీయం చేయాలని కొందరు అనుకోవచ్చుకానీ , ప్రజలుమాత్రం అసహ్యించుకుంటారని తెలుసుకుంటే మంచిది. అందువల్ల , చంద్రబాబుగానీ , పవన్ కళ్యాణ్ గానీ , సోము వీర్రాజు గానీ , కమ్యూనిస్టులు గానీ విగ్రహాల విధ్వంసం ఆపండంటూ పిలుపు ఇవ్వండి .. అంతేతప్ప తోడేళ్ళగుంపులుగా విగ్రహాల విధ్వంసం జరిగిన ఊళ్లపై పడి , ఉద్రిక్తతలు రెచ్చగొడితే చరిత్ర మిమల్ని క్షమించదు.