దేశంలో ఆక్సీజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న వారి దయనీయ సంఘటనలు కోకొల్లలు. ఈ ఉదయం ఢిల్లీలోని బత్రా హాస్పిటల్ లో ఒక డాక్టర్ సహా 8 మంది రోగులు ఆక్సీజన్ లేక చనిపోయారు. వీరంతా ఐసీయులోనే ఉన్నారు. మద్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయింది. ట్యాంకులో ఆక్సీజన్ అయిపోయింది. 1.35 గంటలకు ఆక్సీజన్ ట్యాంకర్ ఆస్పత్రికి వచ్చింది. ఈ 65 నిమిషాల్లో ఆక్సీజన్ లేక 8 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదు మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వీరు కూడా బతుకుతారన్న నమ్మకం లేదని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ గుప్తా తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సీజన్ అయిపోతుందని నిన్నటి నుంచి మొర పెట్టుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం 327 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారని, వారిలో 48 మంది క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్నారని తెలిపారు. ఆక్సీజన్ లేక చనిపోయిన వారిలో అదే ఆస్పత్రిలో పనిచేసే సీనియర్ డాక్టర్ ఆర్కే హిమదని కూడా ఉన్నారు. ఇలాగే ఢిల్లీలోని అనేక ఆస్పత్రుల్లో ఆక్సీజన్ లేక రోగులు కొట్టుమిట్టాడుతూ కళ్ళ ముందే ప్రాణాలు వదులుతున్నారు. చనిపోయే ముందు కూడా తమ ప్రాణాలు కాపాడమని ఆర్తనాదాలు చేస్తున్నారు.